
లైసెన్స్‌డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీష్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాయమాటలు నమ్మి ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలను వదిలి వచ్చిన 6,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆయన ఆరోపించారు. ఆదివారం సిద్దిపేటలో తనను కలిసిన సర్వేయర్ల గోడును విన్న అనంతరం ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
మంచి జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి శిక్షణనిచ్చి ప్రమాణ స్వీకారాలు చేయించిన తర్వాత, ఇప్పుడు ఒక్క ఎకరం సర్వేకు కేవలం రూ.10 కమిషన్ ఇవ్వడం విద్యావంతులైన యువతను అవమానించడమేనని హరీష్ రావు పేర్కొన్నారు. ఏడాది పొడవునా కష్టపడి 2,000 ఎకరాలు సర్వే చేసినా వారికి వచ్చే మొత్తం కేవలం రూ.20 వేలేనని ఆయన విమర్శించారు. ఇది యువతకు ఇచ్చే ఉపాధి హామీనా అని ప్రశ్నించారు.
ఏడాదిగా సరైన వేతనాలు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మండల కార్యాలయాల్లో ఉచితంగా కూలీలలా పని చేయించుకోవడం శ్రమదోపిడీకి ఉదాహరణ అని అన్నారు. సిద్దిపేటలో తనను కలిసి తమ గోడును వెల్లడించిన సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కమిషన్ విధానాన్ని రద్దు చేసి తక్షణమే గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వేయర్ల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.
