Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్
యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్

యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్

Gaddamidi Naveen
1 మార్చి, 2026

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు దుబాయ్‌లో ఉన్న భారతీయ సినీ ప్రముఖులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తన కుటుంబాన్ని సందర్శించేందుకు దుబాయ్ వెళ్లిన టాలీవుడ్ నటుడు విష్ణు మంచు, అక్కడి భయానక పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శనివారం రాత్రి ఆకాశంలో క్షిపణులు ప్రయాణిస్తున్న దృశ్యాలు, వాటిని అడ్డుకునే క్రమంలో వినిపించిన భారీ పేలుడు శబ్దాలతో విష్ణు నివాసం ఒక్కసారిగా వణికిపోయింది.

ఏ బిడ్డకూ ఈ పరిస్థితి రాకూడదు: విష్ణు మంచు

విష్ణు మంచు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ.. క్షిపణుల ధాటికి తన చిన్నారి కుమార్తె ఐరా ఎంతగా భయపడిందో వివరించారు. "దుబాయ్‌లో క్షిపణులు ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీ శబ్దాలు మా ఇంటిని కుదిపేశాయి. ఏ బిడ్డ కూడా తన ఇంటిపై యుద్ధ శబ్దాలను వింటూ పెరగకూడదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పౌరుల రక్షణ కోసం కృషి చేస్తున్న యూఏఈ రక్షణ దళాలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి సంఘటనలు జీవితం ఎంత సున్నితమో గుర్తు చేస్తున్నాయని, శాంతి కోసం ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి - చిక్కుకున్న సోనాల్ చౌహాన్

మరోవైపు, పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ప్యాసింజర్ టెర్మినల్‌లో నష్టం వాటిల్లిందని, నలుగురు వ్యక్తులు గాయపడ్డారని అల్ జజీరా నివేదించింది. విమాన సర్వీసులు రద్దు కావడంతో నటి సోనాల్ చౌహాన్ అక్కడే చిక్కుకుపోయారు.

భారత్‌కు తిరిగి రావడానికి మార్గం లేకపోవడంతో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయం కోరారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, భారత "గౌరవనీయులైన ప్రధాని గారు, దుబాయ్‌లో విమానాలు రద్దయ్యాయి. సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి ప్రభుత్వం మద్దతు, మార్గదర్శకత్వం ఇవ్వాలని కోరుతున్నాను" అని ఆమె విన్నవించారు.

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై క్షిపణి దాడులు జరపడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. టెహ్రాన్ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం ఈ దాడుల్లో దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య దుబాయ్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

యుద్ధం నీడలో దుబాయ్: పీఎం మోదీ సాయం కోరిన సోనాల్ చౌహాన్ - Tholi Paluku