
బీజేపీ అధికారానికి కౌంట్ డౌన్ ప్రారంభం: కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టు నుంచి విముక్తి పొందిన 48 గంటలకే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పార్టీ ర్యాలీలో మాట్లాడుతూ ‘బీజేపీ అధికారానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది’ అని ప్రకటించారు. ఇటీవల ట్రయల్ కోర్టు ఆయనను, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా 21 మందిని ఎక్సైజ్ కేసులో విడుదల చేసిన విషయం తెలిసిందే. చార్జ్‌షీట్‌లో అంతర్గత విరుద్ధతలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించిందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ తీర్పు తన నిజాయితీకి నిదర్శనమని, తాను ‘కట్టర్ ఇమాందార్’నని అన్నారు. ఇది చారిత్రాత్మక తీర్పని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అవినీతి పరుడని, దొంగని, రూ.1000 కోట్లు స్కాం చేశారని మీడియాలో డిబేట్లు పెట్టారు. కానీ అదంతా ఉత్తదని కోర్టు తీర్పు ఇచ్చింది. నేను కూడా ఐఐటీలో చదివా. నా మిత్రులు అంతా అమెరికాలో మంచి స్థానాల్లో ఉన్నారు. ఇక్కడి రాజకీయాలు చూసి నేను కూడా అక్కడికి వెళితే నా చదువుకు ఏం విలువ ఉంది. నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. అనంతరం రాజకీయాల్లో అవినీతిని చూసి ఇక్కడి వ్యవస్థను నా వంతుగా మార్చాలని వచ్చా. పది సంవత్సరాలుగా ఢిల్లీ సీఎంగా ఉన్నా. అప్పుడు మా ప్రభుత్వం ఏం చేసిందో, మీకు తెలుసు. పది సంవత్సరాల్లో ఎక్కడైనా, ఎవరైనా కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నాడని చెబితే నేను రాజకీయాలు వదిలేస్తా అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. ఒక నియంత భయపడితే అతని పాలన అంతానికి సంకేతమని వ్యాఖ్యానించారు. ప్రధాని అందరికీ భయపడుతున్నారని, శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ను జైలుకు పంపారని కూడా ఆరోపించారు. వికసిత్ భారత్ విజన్‌పై స్పందిస్తూ, ప్రజలకు ‘రహనే లాయక్ భారత్’ కావాలని అన్నారు. అలాగే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మోడీ వచ్చాడు. దేశ ప్రజలు తమ జీవితాలు మారుతాయనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ఏవియేషన్, రైళ్లు, ఆసుపత్రులు, విద్య ఇలా అన్నింటిని ధ్వంసం చేశారు.
ఢిల్లీ పరిస్థితులపై కూడా ఆయన విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో రహదారులు చెడిపోయాయని, నీటి సరఫరా సమస్యలు పెరిగాయని, కాలుష్య పరిస్థితి మరింత విషమించిందని ఆరోపించారు. 2011 ఏప్రిల్ 4న జంతర్ మంతర్ వద్ద జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తుచేస్తూ, అప్పట్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిందని చెప్పారు. ఇప్పుడు అదే ప్రాంగణంలో బీజేపీ అధికారానికి ముగింపు సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా ఆప్‌కు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. కోర్టు తీర్పు అనంతరం పార్టీ శక్తిని ప్రదర్శించేందుకు ఈ సభ వేదికగా మారింది.
