

పుదుచ్చేరిని మెడికల్ హబ్ గా చేస్తాం ప్రధాని మోడీ
పుదుచ్చేరిని ‘మెడికల్ హబ్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటనలు చేశారు. ఆదివారం పుదుచ్చేరిలో నిర్వహించిన ప్రజా సభలో ఆయన రూ.1,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారు.
పుదుచ్చేరి మెడికల్ టూరిజం హబ్‌గా
పుదుచ్చేరిలో ఇప్పటికే తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉన్నాయని గుర్తుచేసిన ప్రధాని, ఈ ప్రాంతాన్ని మెడికల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు విస్తారంగా ఉన్నాయని అన్నారు. పుదుచ్చేరి ప్రజలు చికిత్స కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇతర రాష్ట్రాల ప్రజలే ఇక్కడికి రావాలని పేర్కొన్నారు. జవహర్ ఇన్సిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్ )లో ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్ ఆధునికీకరణతో ఆరోగ్య సేవలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. అదేవిధంగా పీఎం-అభీం పథకం కింద మూడు క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కనెక్టివిటీకి ప్రాధాన్యం
కనెక్టివిటీనే అభివృద్ధికి పునాది అని ప్రధాని అన్నారు. పుదుచ్చేరి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు రూ.1,000 కోట్ల ప్రాజెక్టులు ప్రకటించగా, అందులో రూ.140 కోట్ల ఫ్లైఓవర్ కూడా ఉంది. ఈస్ట్ కోస్ట్ రోడ్డు, గ్రాం సదరన్ ట్రంక్ రోడ్డు అప్‌గ్రేడ్‌తో చెన్నై–పుదుచ్చేరి ప్రయాణ సమయం 1.5 నుంచి 2 గంటలకు తగ్గుతుందని తెలిపారు.
పర్యాటక రంగం, యువత సాధికారత
పుదుచ్చేరి ఇప్పటికే వీకెండ్ టూరిజం గమ్యస్థానంగా ప్రాచుర్యం పొందిందని, ఆధ్యాత్మిక, ఈకో, హెల్త్ టూరిజం రంగాల్లో పెట్టుబడులతో మరింత అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కరైకల్ లో డా. ఏపీజే అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ బ్లాక్, ఆసుపత్రి సదుపాయాల విస్తరణ ద్వారా సాంకేతిక విద్య బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పుదుచ్చేరి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ చేపట్టినట్టు తెలిపారు.
కాంగ్రెస్–డీఎంకే పాలనపై విమర్శలు
పుదుచ్చేరిలో జరిగిన సభలో కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. మునుపటి కాంగ్రెస్–డీఎంకే పాలనలో రాజకీయ అస్థిరత, అవినీతి ఆరోపణలు, నేరాల పెరుగుదల, పేదల పట్ల నిర్లక్ష్యం చోటుచేసుకున్నాయని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పుదుచ్చేరిని ఢిల్లీలో కూర్చున్న ఒక కుటుంబానికి ఏటీఎంలా మార్చిందని వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకే పాలనలోనూ స్కామ్‌లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఈ రెండు పార్టీలు కలిసి పుదుచ్చేరి అభివృద్ధి ప్రయాణానికి అడ్డంకులయ్యాయని తెలిపారు.పుదుచ్చేరి అభివృద్ధికి కాంగ్రెస్ స్పీడ్ బ్రేకర్ లా వ్యవహరించిందని ఆరోపించారు.
రూ. 2,700 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
ఈ సందర్భంగా ప్రధాని రూ.2,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఇవి మౌలిక వసతులు, పట్టణ సేవలు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధికి సంబంధించినవిగా పేర్కొన్నారు.
పుదుచ్చేరి బెస్ట్ మంత్రం
బెస్ట్ అంటే బిజినెస్, ఎడ్యుకేషన్, స్పిరిచువాలిటీ, టూరిజం అని ప్రధాని వివరించారు. గత నాలుగున్నరేళ్లలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో పుదుచ్చేరి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు.
పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలి: సీఎం ఎన్.రంగస్వామి
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఉద్దేశించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా (స్టేట్‌హుడ్) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐఎన్‌ఆర్‌సీ–బీజేపీ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రంగస్వామి, పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి పుదుచ్చేరికి వచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం పూర్తి సహకారం అందించిందని, పుదుచ్చేరిని ఉత్తమ కేంద్ర పాలిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అయితే, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పూర్తి రాష్ట్ర హోదా అంశం తనకు ‘చిన్న బాధ, ఆందోళన’గా ఉందని సీఎం పేర్కొన్నారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని శాసనసభలో 13 సార్లు తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపినట్టు వెల్లడించారు. రాష్ట్ర హోదా ప్రజల ఆకాంక్ష అని, ప్రధాని ఈ డిమాండ్‌ను ఆమోదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వానికి పథకాలను వేగంగా అమలు చేసే పూర్తి అధికారాలు అవసరమని కూడా అన్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తి కాలాన్ని పూర్తి చేసుకుంటోందని, తమ పాలనలో మౌలిక వసతుల అభివృద్ధి సహా అనేక ప్రాజెక్టులు అమలయ్యాయని రంగస్వామి తెలిపారు. కేంద్ర సహకారంతో అభివృద్ధికి నిధుల ప్రవాహం పెరిగిందని చెప్పారు. రైతులు, అణగారిన జాతుల సంక్షేమానికి పలు పథకాలు పూర్తి చేసినట్టు, విద్య, సామాజిక సంక్షేమం, మహిళా రక్షణ రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని, ముఖ్యంగా సామాజిక భద్రత, మహిళా రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. పుదుచ్చేరి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నమూనాను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని అన్నారు.
మధురైలో రూ.4,400 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మధురైలో రూ.4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, తమిళనాడు అభివృద్ధి కేంద్ర లక్ష్యమని తెలిపారు. వికసిత భారతానికి వికసిత తమిళనాడు అవసరం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.రహదారులు, రైల్వేలు, ప్రసార సేవలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. చెన్నై–చెన్నై ఎగ్మోర్ నాలుగో రైల్వే లైన్‌ను దేశానికి అంకితం చేయడంతో పాటు, పలు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. తర్వాత ప్రధాని తిరుప్పరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి తదితరులు పాల్గొన్నారు.
