Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నిబంధనల ఉల్లంఘనే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణం :డిప్యూటీ సీఎం

నిబంధనల ఉల్లంఘనే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణం :డిప్యూటీ సీఎం

Panthagani Anusha
1 మార్చి, 2026

సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన ఘోర పేలుడు ప్రమాదానికి యాజమాన్యం అనుసరించిన భద్రతా లోపాలు, నిబంధనల ఉల్లంఘనే ప్రధాన కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌ను సందర్శించిన ఆయన, పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్న పవన్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎనిమిది మంది పని చేయడానికి మాత్రమే అనుమతి ఉన్న చోట నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 31 మందితో పని చేయించడం యాజమాన్యం చేసిన అతిపెద్ద తప్పిదమని జాతరలు, పండుగల సీజన్ కావడంతో లాభార్జనే ధ్యేయంగా పెట్టుకుని పరిమితికి మించి కూలీలను పనిలో పెట్టుకోవడం వల్లే ఇంతటి భారీ ప్రాణనష్టం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికే చర్చించామని భవిష్యత్తులో ఇలాంటి హృదయవిదారక సంఘటనలు పునరావృతం కాకుండా బాణసంచా యూనిట్లపై నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అనుమతులు తీసుకున్న మేరకు భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో నిరంతర నిఘా ఉంచేలా కొత్త విధివిధానాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రులు పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ఉల్లంఘనే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణం :డిప్యూటీ సీఎం - Tholi Paluku