Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
తెలంగాణ ప్రభుత్వ ‘99’ రోజుల ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణ ప్రభుత్వ ‘99’ రోజుల ప్రత్యేక కార్యాచరణ

Gaddamidi Naveen
1 మార్చి, 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు మరింత సమర్థవంతంగా చేరేలా ప్రత్యేకంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని 4 కోట్ల ప్రజల పండుగగా ఘనంగా నిర్వహించాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురస్కరించుకుని 99 రోజుల కార్యక్రమాన్ని బాధ్యతగా, షెడ్యూలు ప్రకారం.. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ 99 రోజుల కార్యక్రమానికి ప్రత్యేక లోగో రూపొందించాలని సూచించారు. ప్రతి రోజూ ప్రాధాన్యత కలిగినదిగా భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అధికారులు పనితీరులో అలసత్వం ప్రదర్శించకూడదని, కార్యక్రమ పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తానని సీఎం తెలిపారు.

పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగం అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. ప్రజలు ఇంటి నుంచే కరెంట్ మీటర్, ఇల్లు నిర్మాణ అనుమతులు, నల్లా కనెక్షన్లు వంటి సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని, పౌరసేవలను మరింత సులభతరం చేయాలని పేర్కొన్నారు.

మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వంద మండలాల్లో ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా అద్దె భవనాల్లో ఉండకూడదని, ప్రతి శాఖకు సొంత భవనం ఉండేలా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

ప్రజలు ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు అవసరమైన సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని అధికారులకు సూచించారు. అన్ని సేవలను ఆన్‌లైన్ ద్వారా పొందే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు. పరిపాలనలో పారదర్శకత, వేగవంతమైన సేవలందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణ రైజింగ్ - ఆర్ధిక విజన్

‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని క్యూర్,ప్యూర్,రేర్ జోన్లుగా అభివృద్ధి చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం తదితర వేదికల ద్వారా వచ్చిన రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా, ప్రభుత్వ పథకాల అమలులో క్షేత్రస్థాయి పర్యవేక్షణను పెంచాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కార్యక్రమం విజయవంతం కోసం అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ ‘99’ రోజుల ప్రత్యేక కార్యాచరణ - Tholi Paluku