
ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’లో రిచాఘోష్ పేరు: టీఎంసీ ఆరోపణ
ఐసీసీ మహిళల వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యురాలైన భారత మహిళల క్రికెటర్ రిచా ఘోష్ పేరు ఫిబ్రవరి 28న విడుదల చేసిన బెంగాల్ తుది ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’(వివరాలపై సందేహం లేదా అభ్యంతరం ) కేటగిరీలో ఉంచినట్లు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆదివారం ఆరోపించింది. దీనిని ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్ గా అభివర్ణించింది.
సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్ వార్డు నం.19కు చెందిన రిచా ఘోష్ ఇటీవల పశ్చిమ బెంగాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాలో చేరి, సిలిగురి పోలీస్ కమిషనరేట్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా బాధ్యతలు స్వీకరించారు. టీఎంసీ తమ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో, భారత ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేసింది. ప్రపంచ కప్ గెలిచిన జాతీయ క్రీడాకారిణి పేరు కూడా తుది ఓటరు జాబితాలో ‘అండర్ అడ్జుడికేషన్’గా చేర్చడం విడ్డూరమని, ఇది ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యగా అభివర్ణించింది.
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ప్రముఖులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే సాధారణ ఓటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలంటూ టీఎంసీ ప్రశ్నించింది. బెంగాల్ స్వరాన్ని ఒక్కో పేరుతో తొలగించే, నొక్కే క్రమబద్ధమైన ప్రయత్నం ఇది అని పార్టీ ఆరోపించింది. 22 ఏళ్ల వికెట్‌కీపర్–బ్యాటర్ రిచా ఘోష్, 2025 ఐసీసీ మహిళల వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్నారు
